దివంగత నేత భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఆదివారం దాడి జరిగిన సంగతి తెలిసిందే . ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్ యాత్ర చేస్తోన్న ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడి చేసి పరారయ్యారు. తనపై దాడి చేయించింది మంత్రి అఖిలప్రియే అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి కేసు దర్యాప్తు వివాదాస్పదంగా మారింది. మంత్రి అఖిలప్రియ ఆదేశాలతోనే దాడి జరిగిందని ఆరోపిస్తూ సుబ్బారెడ్డి ఫిర్యాదుచేయగా.. పోలీసులు మాత్రం అనూహ్యంగా మంత్రి పేరును తొలగించారు. బాధితుడి ఫిర్యాదును పక్కనపారేసి, పోలీసులనే సాక్ష్యులుగా పేర్కొంటూ మరో కేసు నమోదు చేశారు.
దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసును నీరుగార్చేప్రయత్నం చేస్తున్నారని ఏవీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ సుబ్బారెడ్డి సోమవారం కూడా తన సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే ఈ దాడిలో అఖిలప్రియ పాత్రకు సంబంధించి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నా పోలీసులు మాత్రం వాటిని పక్కనపెట్టేయడం గమనార్హం. మంత్రి పేరును తొలగించి, పోలీసులే సాక్ష్యులుగా మరో కేసు నమోదుచేసి, దానిపై దర్యాప్తు చేపట్టారు. దీనిపై పోలీసులు వివరణ ఇవ్వాల్సిఉంది. రాళ్లదాడి అనంతరం ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.