అధికార తెలుగుదేశం పార్టీలో వర్గ విబేధాలు భయానక దాడులకు దారితీశాయి. దివంగత భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఆదివారం దాడి జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్ యాత్ర చేస్తోన్న ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడి చేసి పరారయ్యారు. తనపై దాడి చేయించింది మంత్రి అఖిలప్రియే అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే తనపై రాళ్ల దాడి మంత్రి అఖిలప్రియ వర్గీయుల పనేనని టీడీపీ నాయకడు ఏవీ సుబ్డారెడ్డి ఆరోపించారు. ఆళ్లగడ్డలోని తన స్వగృహంలో ఆదివారం విలేఖరులతో మాట్లాడారు. శిరివెళ్ల, గోవిందపల్లె ముగించుకొని యర్రగుంట్ల గ్రామం సంతలో యాత్ర చేస్తుండగా నాలుగు స్కార్పియో వాహనాల్లో వచ్చిన దుండగులు రాళ్లు, కర్రలతో దాడులు చేశారని తెలిపారు. తాము ప్రతిఘటించేలోగా పారిపోయారన్నారు. భూమా నాగిరెడ్డితో కలిసి 35 ఏళ్లు ఫ్యాక్షన్ చేశానని, అనుచరులను కోల్పోయి భూమా కుటుంబానికి అండగా ఉన్నానని అన్నారు. ఫ్యాక్షన్ సంస్కృతి వీడి శాంతియుతంగా జీవిస్తున్న తనపై దాడి చేయడం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని అన్నారు. పోలీసులు చట్టపరమైన చర్చలు తీసుకుంటారని ఆశిస్తున్నానని, పోలీసులు న్యాయం చేయకపోతే వ్యక్తిగతంగా పోరాడ తానని, ఏవీ అంటే ఏమిటో చూపిస్తానని ఘాటుగా స్పందించారు.