టాలీవుడ్ యంగ్ హీరో తండ్రికి జైలు శిక్ష..!అవును.టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకి కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. బ్యాంకులో పని చేస్తూ, నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు నుండి అప్పు తీసుకున్న కేసులో బసవరాజుకు ఈ శిక్ష పడింది.ఏపీ లోని వైజాగ్ వేపగుంట కు చెందిన బసవరాజు సింహాచలం 2013లో స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ క్యాషియర్‌గా విధులు నిర్వహించేవారు.
అయితే ఆ సమయంలో తన భార్య రాజ్యలక్ష్మీ పేరుతో పాటు ఎం.ఎస్.ఎన్.రాజు, సన్యాసి రాజు, సాంబమూర్తి వెంకట్రావుల పేర్ల మీద నకిలీ బంగారం తాకట్టు పెట్టి 9.85 లక్షల రూపాయలు రుణం తీసుకున్నారు. అయితే బ్యాంక్ అధికారుల తనిఖీల్లో ఆ బంగారం నకిలీది అని తేలడంతో బసవరాజుపై బ్యాంక్ మేనేజర్ గరికిపాటి సుబ్రహ్మణ్యం గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బసవరాజుపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసు శుక్రవారం విచారణకి వచ్చింది. దీంతో మేజిస్ట్రేట్ సన్నీ పర్విన్ సుల్తానా బేగం రాజ్ తరుణ్ తండ్రి బసవరాజుకి మూడేళ్ళ జైలు శిక్షతో పాటు 20వేల రూపాయల జరిమానా విధించారు.