ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కృష్ణా జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. ఇలా ప్రజల్లో ఆదరణ పొందుతూ.. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తూ జగన్ తన పాదయాత్రను చేస్తున్నారు. జగన్‌లో వచ్చిన రాజకీయ పరిణితిని గమనించిన రాజకీయ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్ జగన్‌కు పెరుగుతున్న ఆదరణను చూసిన పలువురు సీనియర్ నాయకులు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే గతంలో మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత టీడీపీ నేత సాయిప్రతాప్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రపై పొగడ్తల వర్షం కురిపించారు. జగన్ మోహన్‌రెడ్డి ఓ డైనమైట్ అని, ఏ నాయకుడు చేయని విధంగా జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారని ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే.. సాయి ప్రతాప్‌రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని, ఆ నేపథ్యంలోనే పై విధంగా మీడియా ముఖంగా జగన్‌పై ప్రశంసలు కురిపించారని సమాచారం. ఆ క్రమంలోనే సాయి ప్రతాప్‌రెడ్డి వైసీపీ నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారట. ఈ విషయం తెలుసుకున్న కడప టీడీపీ నేతలు సాయి ప్రతాప్‌రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
అంతేకాక, తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురం అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ,సీనియర్ నేత అయిన తోట త్రిమూర్తులు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు అని జిల్లా రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇప్పటికే వైసీపీ పెద్దలతో త్రిమూర్తులు చర్చలు కూడా జరిపారు. అందులో భాగంగా తను వైసీపీ పార్టీలో చేరితే తన సిట్టింగ్ స్థానానికి ఎటువంటి ప్రమాదం లేకుండా మాజీ మంత్రి అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఎమ్మెల్సీ పదవిచ్చి త్రిమూర్తులు చేరికకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయింది అని అంటున్నారు. రాజకీయ వర్గాలు .తోట త్రిమూర్తులు రేపో మాపో ఒక భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు అని అతని అనుచవర్గం చెబుతున్నారు.