ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బావమరిది, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను బీజేపీ టార్గెట్ చేసుకుంది. ఆయన ఎమ్మెల్యే సీటుకు ఎర్త్ పెట్టేందుకు సిద్ధమైంది. ఏపీ సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. మోడీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణపై బీజేపీ సీరియస్ అయ్యింది.
విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ తో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ధర్మ పోరాట దీక్షలో ప్రధానమంత్రి మోడీపై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే విష్టుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ లు ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.. రాజ్యాంగంపై గౌరవం లేని వ్యక్తి ప్రజాప్రతినిధిగా కొనసాగే హక్కు లేదని, వెంటనే బాలకృష్ణను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రధానిపై దాడి చేయాలంటూ ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో బాలకృష్ణ మాట్లాడటంపై పోలీసులు తక్షణమ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తామే ఫిర్యాదు చేస్తామన్నారు. గతంలో బాలకృష్ణ ఇంట్లో తుపాకీ కాల్పుల ఘటన, సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి వంటి సంఘటనలను ఈ సందర్భంగా ఉదహరించారు. చట్టం నుంచి తప్పించుకునే తెలివితేటలు బాలకృష్ణ సొంతమైతే, తాము చట్టం, న్యాయ పరంగా చర్యలకు ఉద్యమిస్తామన్నారు. సీఎం చంద్రబాబు విజయవాడలో చేస్తున్న దీక్ష సందర్భంగా బాలకృష్ణ ఒక ఉన్మాది మాదిరి ప్రధానిపై విమర్శలు చేయడం ఆయన మానసిక స్థాయికి నిదర్శనమని పేర్కొన్నారు. కాగా, బీజేపీ నేతల ఫిర్యాదుతో బాలయ్య ఎమ్మెల్యే గిరీపై గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనే ఆసక్తిమొదలైంది.