కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ టీడీపీలో గ్రూపు తగాదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఆర్ఐసీ చైర్మన్, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఎవరికి వారుగా దీక్షలు చేపట్టారు.
‘ధర్మపోరాట దీక్ష’ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన కార్యక్రమానికి మద్దతుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు దీక్షలు చేపట్టారు. అయితే, ఎవరికి వారుగా బలప్రదర్శన తరహాలో వీటిని చేపట్టడం గమనార్హం. ఆళ్లగడ్డలో ఏకంగా దీక్షకు తరలి వచ్చిన ఏవీ సుబ్బారెడ్డి అనుచరులపై మంత్రి వర్గీయులు దాడికి దిగారు. పరిస్థితి కొట్టుకునే స్థాయి వరకూ వెళ్లింది. నంద్యాల నుంచి ఏవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ బైకు ర్యాలీగా చేరుకుని.. ఆళ్లగడ్డలోని దీక్షా శిబిరానికి మద్దతు ఇచ్చేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ అనుచరులు వారిపై దాడికి దిగినట్టు తెలుస్తోంది. కర్నూల్ జిల్లావ్యాప్తంగా అధికార పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో ఒకవైపు ఆధిపత్య పోరు, మరోవైపు అధికార దుర్వినియోగం స్పష్టంగా కన్పించింది.