తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రయత్నం ఫలించింది. సుదీర్ఘంగా కొనసాగించిన తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాల వల్ల తెలంగాణ ఎయిమ్స్‌కి మార్గం సుగమం అయింది. ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవైపు సీఎం కెసిఆర్, ఢిల్లీలో ఎంపీలు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు చేసిన పలు ప్రయత్నాలు సఫలం అవడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర విభజన సమయంలోనే రెండు రాష్ట్రాలకు ఎయిమ్స్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఏపీకి ఎయిమ్స్ ప్రకటన వెలువడినప్పటికీ, తెలంగాణకు ఆలస్యమైంది. దీంతో తెలంగాణ సీఎం కెసిఆర్, వైద్య మంత్రి లక్ష్మారెడ్డిలు పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ వస్తున్నారు. సిఎం ప్రధాన మంత్రి మోడీకి కూడా ఈ విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా తదితరులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పలు సార్లు ఎయిమ్స్ విషయమై అభ్యర్థిస్తూనే ఉన్నారు. మరోవైపు ఎంపీలు కూడా ఈ విషయమై పార్లమెంట్‌లో ప్రశ్నించారు. దీంతో గత బడ్జెట్‌లో తెలంగాణకు ఎయిమ్స్ ఇస్తామని చెప్పినప్పటికీ నిధులు కేటాయించలేదు. ప్రకటన ప్రకటనగానే మిగిలిపోయింది. ఈ దశలో పదే పదే చేసిన ప్రయత్నాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఎయిమ్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది.
కాగా, ఇప్పటికే మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ పని ప్రారంభించగా, సిద్దిపేటకు మెడికల్ కాలేజీ అనుమతి లభించింది. ఇక సీఎం కెసిఆర్ ఇచ్చిన హామీల మేరకు సూర్యాపేట, నల్లగొండలకు మెడికల్ కాలేజీల కసరత్తు ముమ్మరంగా సాగుతున్నది. ఈ రెండు కాలేజీలకు కూడా తర్వలోనే అనుమతులు రానున్నాయి. తాజాగా ఎయిమ్స్‌కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో రానున్న ఏడాదితో కలుపుకుని ఐదేళ్ళ కాలంలో ఏడాదికోటి చొప్పున మొత్తం ఐదు ప్రతిష్టాత్మక మెడికల్ సంస్థలు వచ్చినట్లయింది. దీంతో రాష్ట్రంలో అత్యవసర, మెరుగైన, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. మిగతా దవాఖానాల మీద ఒత్తిడి తగ్గి, అన్ని చోట్లా మంచి వైద్యం అందే అవకాశాలుంటాయన్నారు. అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు సిఎం కెసిఆర్, ఎంపీలు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులందరికీ మంత్రి లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.