ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు వైసీపీ బలం అంతకు అంత పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. గత 4 ఏళ్ల నుండి అధికారంలో ఉండి ప్రజలకు న్యాయం చేయకపోవడమే గాక అన్యాయలకు అడ్డగా మార్చుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. రాయలసీమలో మరి దారుణంగా పాలన కొనసాగిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. తాజాగా ప్రాణమున్నంత వరకు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తోనే ఉంటామని అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి కుమారులు ప్రతాప్‌రెడ్డి, వెంకటేశ్‌రెడ్డిలు స్పష్టం చేశారు. బీఎన్‌ఆర్ సోదరులు గురునాథ్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డిలు ఇటీవలే వైసీపీ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఈక్రమంలో బీఎన్‌ఆర్ కుమారులు కృష్ణా జిల్లాలో సాగుతున్న పాదయాత్రకు వెళ్లి జగన్‌ను కలిశారు. బీఎన్‌ఆర్ కుటుంబం టీడీపీలో చేరలేదని, ఆయన సోదరులు మాత్రమే టీడీపీలో చేరారని ప్రతాప్‌రెడ్డి, వెంకటేశ్‌రెడ్డిలు ఆయనకు తెలిపారు. మేం ప్రాణమున్నంత వరకూ వైఎస్ జగన్‌తోనే ఉంటాం. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాం. కొన్ని అనివార్య కారణాలతో కొద్దిరోజులుగా ఈ ప్రకటన చేయలేదు. జగన్‌ను కలిసి మా అభిప్రాయం చెప్పాం. అనంతపురం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. తుది వరకూ వైసీపీ లోనే ఉంటామని స్పష్టం చేశారు. వారితో కాసేపు అనంతపురం నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. బీఎన్‌ఆర్ కుమారులు జగన్‌మోహన్‌రెడ్డిని కలవడం అనంతపురం నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
షాక్‌లో గురునాథ్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి
అనంతపురం ఎమ్మెల్యేగా బి.నారాయణరెడ్డికి మంచిపేరు ఉంది. బీఎన్‌ఆర్ సోదరులుగానే గురునాథ్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డిలకు గుర్తింపు. బీఎన్‌ఆర్ ప్రాణమున్నంత వరకూ వైఎస్ కుటుంబంతోనే నడిచారు. ఆయన మరణానంతరం ముగ్గురు సోదరులు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీన్ని అనంతపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా తప్పుబట్టారు. బీఎన్‌ఆర్‌ను చూసే గురునాథరెడ్డికి ఓట్లేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించామని చర్చించుకున్నారు. అలాంటిది టీడీపీలోకి వెళ్లడమంటే బీఎన్‌ఆర్ కాకుండా వారు ముగ్గురు వ్యక్తులుగా టీడీపీలో చేరడమే అనే చర్చ ‘అనంత’లో నడుస్తోంది. ఈక్రమంలో బీఎన్‌ఆర్ కుమారులు తాము వైసీపీలోనే ఉన్నామని స్పష్టం చేయడంతో బీఎన్‌ఆర్ పేరు లేకుండా వారి సోదరులు చేసే రాజకీయం తెప్ప లేకుండా నావ నడిపినట్లే. ఈ పరిణామం గురునాథ్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డితో పాటు రెడ్డప్పరెడ్డికి పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్లయింది.