దేశంలోనే కార్మికుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం మొదటి వరుసలో నిలిచిందని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహ రెడ్డి తెలిపారు.ఢిల్లీలోని ప్రవాస భారతీయ కేంద్రంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై జరిగిన జాతీయ సమావేశంలో రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, వారి సమస్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.అనంతరం మంత్రి నాయిని మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో 11 లక్షల 286 మంది భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం గుర్తించిందని, వారి అభివృద్ధికి అన్ని విధాలుగా కేసీఆర్ మార్గదర్శకంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు.
భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి పేరుతో అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో వివాహ కానుక పేద కుటుంబాలకు మద్దతుగా నిలిచిందని మంత్రి నాయిని అన్నారు. ఇప్పటి వరకు 7 వేల 719 మంది కార్మికులు వివాహా కానుకను అందుకున్నారని మంత్రి వెల్లడించారు. కార్మిక సంక్షేమ మండలిలో పేర్లు నమోదు చేసుకున్న కార్మికుడి కుటుంబానికి మెటర్నటి బెనిఫిట్ ను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని, ఇందులో భాగంగా కాన్పుకు 30 వేల రూపాయలను ప్రభుత్వం అందిస్తుందని మంత్రి తెలిపారు.దాదాపు 13 వేల 996 కార్మికులు ప్రసూతి కానుక ద్వారా ఆరోగ్యమైన బిడ్డలకు జన్మనిచ్చారని మంత్రి తెలిపారు. అన్నింటకన్నా ముఖ్యంగా ప్రమాదంలో కార్మికుడు మరణిస్తే, ఆ కుటుంబాన్ని ఆదుకునేల తెలంగాణ ప్రభుత్వం 6 లక్షల ప్రమాద భీమాను అందిస్తుందని, ఈ భీమాలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 768 కుటుంబాలు లబ్ది పొందాయని మంత్రి గుర్తు చేశారు.
భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికులకు భద్రత – ఆరోగ్య – నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా వొకేషనల్ కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 35 వేల 300 మందికి శిక్షణ అందించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 768 కార్మిక బాధిత కుటుంబాలకు 29 కోట్ల 66 లక్షల 88 వేలు రూపాయలను చెల్లించినట్లు మంత్రి తెలిపారు.