తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లకు ఇవాళ హైకోర్టులో ఊరట లభించింది. వారిపై విధించిన ఎమ్మెల్యే సభ్యత్వ రద్దును కోర్టు ఎత్తివేసింది. వారి ఎమ్మెల్యే సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వారు తప్పుచేసి ఉంటే ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని, వారి అసెంబ్లీ సభ్యత్వాలను రద్దు చేయడం సరికాదని కోర్టు తేల్చి చెప్పింది.
ఈ సందర్భంగా టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..అసెంబ్లీ సభ్యత్వాల రద్దు కేసులో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని అన్నారు . హైకోర్టు తీర్పు నిరంకుశ పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ కు చెంపపెట్టులాంటిదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ న్యాయాన్ని నమ్ముకుందని, ఆ న్యాయమే తమను కోర్టులో గెలిపించిందని, ప్రజల మద్దతుతోనే ముందుకెళుతున్నామని చెప్పారు.