తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు సీఎం కావడం మన అదృష్టమన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఇవాళ తెలంగాణ ప్రాంత బీడు భూములను సస్య శ్యామలం చేసేందుకు శరవేగంగా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్లనున్న టీఆర్‌ఎస్వీ విద్యార్థులకు ఈ ప్రాజెక్టుపై హరీష్‌రావు అవగాహన కల్పించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 31 జిల్లాల సమన్వయకర్తలు, 119 నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టుపై టీఆర్ఎస్ నేతలకు అవగాహన ఉండాలన్నారు. ఈ క్రమంలోనే ఇవాల్టి నుంచి రెండు రోజుల పాటు నేతల కోసం బస్సు యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నేతలు ప్రాజెక్టుల పనులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.మంగళవారం మేడిగడ్డలో ప్రారంభమవుతున్న ఈ యాత్ర..గురువారం కొండపోచమ్మ సాగర్ దగ్గర యాత్ర ముగుస్తుందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు 20 సంవత్సరాలు పట్టేదని..ఇప్పుడు రికార్డు లెవల్ లో కాళేశ్వరం త్వరగా పూర్తి చేసి చరిత్ర సృష్టిస్తామన్నారు.కాల్వలు తవ్వి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. ఈ విషయం మేము చెప్పడంలేదని, కేంద్ర జలవనరుల సంఘం చెప్పిందన్నారు. ఇదే సంఘం ఇప్పడు TRS చేస్తున్న ప్రాజెక్టు డీజైన్స్ చాలా బాగున్నాయని ప్రశంసిస్తుందని తెలిపారు . తెలంగాణ ప్రజలకు సాగునీరు, తాగునీరు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ ముందున్నారన్నారు.తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయాన్నారు. కోటి ఎకరాలకు నీరు అందించి సీఎం కేసీఆర్ కలను సాకారం చేసుకునే రోజు రాబోతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.