దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును ఆకాంక్షిస్తూ ముందుకు సాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్‌కు ఊహించని మద్దతు దక్కింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో సీఎం కేసీఆర్ ముఖ్యపాత్ర పోషిస్తూ ఇప్పటికే పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ అధినాయకురాలు, ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారు. తర్వాత హైదరాబాద్ వచ్చిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కేసీఆర్‌ను కలిసి మద్దతు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్‌జోగి కూడా కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఫ్రంట్‌కు సానుకూలత వ్యక్తంచేశారు.ఇటీవల బెంగళూరు వెళ్లి జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్‌పై సమాలోచనలు చేశారు. ఇలా వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఫెడరల్ ఫ్రంట్‌ను బలంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో అనూహ్య పిలుపు వచ్చింది.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మే మొదటి వారంలో ఒరిస్సాకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆహ్వానించారు. ప్రస్తుతం ఒరిస్సాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున మే మొదటి వారంలో భువనేశ్వర్ రావలసిందిగా నవీన్ పట్నాయక్ సిఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. దీనికి కేసీఆర్ అంగీకరించారు. దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు తీసుకరావడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం జరగనుంది. కాగా, మే నెల నుంచి ఫ్రంట్ కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయని సమాచారం.