తెలంగాణ రాష్ట్రంలోని జియాగూడలోని చరిత్రాత్మక రంగనాథస్వామి దేవాలయం అరుదైన దృశ్యానికి వేదిక అవుతుంది.బ్రహ్మం ఒక్కటే అన్న అన్నమయ్య సందేశాన్ని అందరికి చాటి చెప్పడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్, చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్.
జియాగూడలోని రంగనాథస్వామి దేవాలయంలో సోమవారం మునివాహన సేవా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దళిత భక్తుడు, దేవీ ఉపాసకుడు ఆదిత్య పరాశ్రీకి ఆలయ ప్రవేశం కల్పించారు. ఆయనను రంగరాజన్ తన భుజస్కంధాలపై ఎత్తుకొని మండపం నుండి ప్రధాన ధ్వజస్థంభం వరకు తీసుకెళ్లారు. ప్రదక్షిణ అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..దళితులపట్ల వివక్షను తొలగించడానికి, సమానత్వాన్ని చాటడానికే దళిత భక్తుణ్ని భుజస్కంధాలపై మోసుకుంటూ ఆలయ ప్రవేశం చేశామన్నారు. ప్రతి దేవాలయంలో మునివాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టి మనుషులంతా ఒక్కటేనని చాటాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.