రోజు రోజుకు పెరుగుతున్న ప్రమాదాల నివారణకు, ప్రాణనష్టం తగ్గించేందుకు రోడ్డు భద్రత నిబంధనలు మరింత కఠినంగా, తప్పకుండా పాటించి ప్రమాదాలను నివారించాలని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ కు చెందిన శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు, యువతకు హెల్మెట్ లను ఆయన నివాసంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంల్లో మరణిస్తున్న వారిలో 25 – 35 ఏళ్ళ యువతనే ఎక్కువ గా ఉన్నారన్నారు. నిర్లక్ష్యం, వేగం,మద్యం సేవించి వాహనాలు నడపడం, రోడ్డు భద్రత నిబంధనలు అతిక్రమించే వారు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం లో ఏటా 5 లక్షల ప్రమాదాల్లో 1.56 లక్షల మంది మృత్యు వాత పడగా రాష్ట్రం లో 20 వేల ప్రమాదాలతో ఏటా 7 వేల మంది మృతి చెందుతున్నారు.ప్రమాదాల నివారణలో తెలంగాణ రాష్ట్రం దేశం లోనే ముందుందని 2020 నాటికి 50% ప్రమాదాలు తగ్గిద్దామని పిలుపునిచ్చారు.
ప్రమాద రహిత తెలంగాణ సాధనకు సహకరించాలని అన్ని వర్గాల వారికి పిలుపునిచ్చారు. ఫ్రమాదాల నివారణ కు ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు తప్పకుండా పాటించాలని మంత్రి మహేందర్ రెడ్డి సూచించారు. విదేశాల తరహాలో నిబంధనలు మరింత కఠినంగా అమలుచేద్దామని చెప్పారు. రోడ్డు భద్రత మీద మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డిలతో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులతో సాగిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ ఇదే విషయం చర్చించామని అన్నారు.