37 లక్షల ఎకరాలకు సాగునీరందించే మహా సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టనుంది.శనివారం ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగిన ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మాణ రంగ చరిత్రలో నిలిచిపోనున్నది.వచ్చే వానాకాలం నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి గాను ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన దిశా నిర్దేశం మేరకు పనులు అనూహ్య రీతిలో ఊపందుకున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ పనులను గత డిసెంబర్ 7 న పరిశీలించారు. కన్నెపల్లి పంప్ హౌజ్, అన్నారం బ్యారేజీ పనులను కూడా ఆరోజు తనిఖీ చేశారు.వానాకాలం నాటికి కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు పంపించడానికి గాను రోజుకు 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరగవలసిందేనని కేసీఆర్ ఆదేశించారు.పనుల వేగానికి ఆయన పలు సూచనలు కూడా చేశారు.సీఎం పర్యటించిన నాలుగు నెలలలో పనుల పురోగతి అటు ఇంజనీర్లను, రాజకీయ నాయకులను అందరినీ అబ్బురపరుస్తున్నది.
సీఎం కేసీఆర్ పర్యటించినప్పుడు మేడిగడ్డ బ్యారేజీలో రోజుకు సగటున 1,169 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరుగుతున్నాయి.సీఎం పర్యటన అనంతరం పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక, వివిధ శాఖలు, అధికారుల మధ్య సమన్వయం, కార్మికులు, ఇంజనీర్ల సంఖ్య పెంపుదల,అవసరమైన ఎక్విప్ మెంటు, యంత్రపరికరాలు సమకూర్చుకోవడం వంటి చర్యలతో రోజుకు 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనుల అసాధారణ రికార్డును తెలంగాణ ఇరిగేషన్ శాఖ సొంతం చేసుకున్నది.ముఖ్యమంత్రి మేడిగడ్డ కు వచ్చి వెళ్ళిన నాటి నుంచి ఈ బ్యారేజీలో ఇప్పటివరకు మొత్తం 5,39,361 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగాయి.సీఎం పర్యటించే నాటికి జరిగిన సిమెంటు కాంక్రీటు పనులు 77,946 క్యూబిక్ మీటర్లు.సీఎంపర్యటన నాడు బ్యాచింగ్ ప్లాంట్లు వినియోగిస్తుందా వాటి సంఖ్య 8 కి పెంచారు.బ్యాచింగ్ ప్లాంట్ల సామర్ధ్యం 390 క్యూబిక్ మీటర్ల్ నుంచి 870కి పెంచారు. బూమ్ ప్లేసర్ల సంఖ్య ను 3 నుంచి 12 కు పెంచారు.కార్మికుల సంఖ్య ను 1,245 నుంచి 3,065 కి పెంచారు.ఇంజనీర్ల్ సంఖ్య ను 113 నుంచి 162 కు పెంచారు.ట్రాన్సిట్ మిక్సరల సంఖ్యను 25 నుంచి 85 కు పెంచారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, సలహాలు, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు నిరంతర పర్యవేక్షణ,సమీక్షల కారణంగానే ఈ అసాధారణ రికార్డు సాధించగలిగినట్టు మేడిగడ్డ బ్యారేజీ నిర్మిస్తున్న ఎల్ అండ్ టి సంస్థ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనుల రికార్డ్ బ్రేకు చేసినందుకు మంత్రి హరీశ్ రావు మరో ప్రకటనలో ఎల్ అండ్ టి సంస్థ, ఇరిగేషన్ అధికార యంత్రాంగాన్ని అభినందించారు.అతి తక్కువ కాలంలో ప్రాజెక్టును పూర్తి చేసి ఆసియా లోనే సరికొత్త రికార్డు నెలకొల్పనున్నట్టు ఆయన చెప్పారు. రోజుకు మూడు టిఎంసిల నీటిని ఎత్తిపోసే ఈ పధకం పూర్తయితే సీఎం కల సాకారమవుతుందన్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన, పాలుపంచుకుంటున్న ఏజెన్సీలు, ఇరిగేషన్ ఇంజనీర్లు, సిబ్బందిని పేరు పేరునా హరీశ్ రావు అభినందించారు.ఇదే పట్టుదల, ఇదే వేగం కొనసాగించాలని అయన సూచించారు.ఇరిగేషన్, రెవిన్యూ, అటవీ, విద్యుత్తు, గనులు తదితర ప్రభుత్వ శాఖలు, కాంట్రాక్టు సంస్థలు సమన్వయంతో సమష్టిగా పనిచేసి నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలన్నారు.భూసేకరణ ప్రక్రియ, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, టెండర్ల ప్రక్రియ,నిర్మాణం….ఇలా అన్ని రంగాల్లోనూ కాళేశ్వరం కొత్త రికార్డులను చరిత్ర లో తిరగరాస్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.