రైతాంగానికి భారత వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. వ్యవసాయానికి అన్ని విధాలా ఊతమిచ్చేలా తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలకు తోడుగా.. కాలం కూడా కలిసి వస్తోంది. ఖరీఫ్ పంటల కోసం సన్నద్ధమవుతున్న రైతాంగానికి.. భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది సకాలంలో వానలు కురుస్తాయని ప్రకటించింది. లోటు వర్షపాతం లేకుండా.. సాధారణ వర్షాపాతం నమోదవుతందని పేర్కొంది .
ఈ సంవత్సరం 97 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. వరుసగా మూడో ఏడాది సాధారణ వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించింది.ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయానికి దేశాన్ని తాకనున్నాయి. మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారం నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 45 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరిస్తాయని ఐఎండీ డీజీ రమేష్ ప్రకటించారు.