130 కోట్ల మంది భారతీయుల సంక్షేమాన్ని , అభివృద్ధిని కాంక్షించే ఒక అద్భుతమైన రాజకీయ వ్యవస్థ కోసం ఈ దేశం ఎదురు చూస్తున్నది . కొన్ని వేల మంది వాటాదారులు , ఎంతో మంది డైరెక్టర్లు కలిసి నడిపే సంస్థలు సక్సెస్ అవుతున్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో ప్రజల్లో ఉండి సక్సెస్ అవుతున్న ప్రగతి కాముక ప్రాంతీయ పార్టీల కూటమి జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైన కూటమిని ఎందుకు నడపకూడదనే ప్రశ్నను ప్రతి భారతీయుడికి కల్పించే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమక్రమంగా సక్సెస్ అవుతున్నట్లే కనిపిస్తున్నది . తమ రాష్ట్రాల గురించి , తమ ప్రజల గురించి ఎంతో తపన పడుతున్న అనుభవమున్న ప్రాంతీయ పార్టీల సారధులు మొత్తం 29 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రజల గురించి ఎందుకు పూర్తి స్థాయిలో ఆలోచించకూడదనే ఆలోచనను రేకెత్తించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయం సాధిస్తున్నట్లు కనపడుతున్నది .
యూపీఏ , ఎన్డీఏ లు కూడా కూటములే . కాకపోతే ఎక్కువ స్థానాలు వచ్చిన జాతీయ పార్టీలు ప్రభుత్వాలను నడిపినయి . అంతే . ఈ దేశంలోని జాతీయ పార్టీల నాయకుల సామర్ధ్యంతో పోలిస్తే ప్రాంతీయ పార్టీల నాయకుల సామర్ధ్యం ఏ మాత్రం తక్కువ కాదు . ఆ సమర్ధత ఉన్న నాయకత్వాలు ఇప్పుడు కలిసికట్టుగా దేశం లో కేసీఆర్ చెబుతున్న గుణాత్మక మార్పు కోసం మనస్ఫూర్తిగా ప్రయత్నించాల్సిన సమయం వచ్చింది . ప్రాంతీయ పార్టీల అగ్ర నాయకులను సమన్వయపర్చడంలో క్రమ క్రమంగా విజయం సాధిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్ధతనే ఒకసారి పరిశీలిస్తే … 14 ఏళ్ళు తెలంగాణ కోసం ఉద్యమించి ప్రజలందరినీ ఏకతాటిపై నడిపిన కార్యదీక్షాపరుడు ఆయన . తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ఒప్పించిన నాయకుడు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఏడాది నుండి తర్వాతి మూడేళ్ళలోనే కేంద్ర ప్రభుత్వం నుండి అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ సంక్షేమ , అభివృద్ధి పథకాల విషయంలో ప్రశంసలు వరుసగా అందుకుంటూనే ఉన్న గొప్ప నాయకుడు . పరిపాలనలో సమాజంలోని అన్ని వర్గాల మెప్పు పొందుతున్న పాలకుడు .
తెలంగాణ ప్రజలకు మేలు చేసే క్రమంలో సాగు నీటి ప్రాజెక్టులు సహా అనేక అంశాలపై జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న పరిపాలనాదక్షుడు . అలాంటి నాయకుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ , బీజేపీ లకు ప్రత్యామ్నాయంగా దేశంలో దాదాపుగా 50 శాతం ఓటింగ్ కలిగి ఉన్న ప్రాంతీయ పార్టీల ఐక్యతకు నడుం బిగించడం భారత వర్తమాన రాజకీయాలకు శుభపరిణామమనే చెప్పాలి . ఎందుకంటే ఆయన ప్రజల మధ్య నుండి … ప్రజల సమస్యల నుండి … ఎదిగిన నాయకుడు . కింది స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు సమస్యల పరిష్కారంలో ఎదురవుతున్న ఇబ్బందుల మీద ఒక పరిపూర్ణమైన అవగాహన ఉన్న నాయకుడు . అందుకే ఆయన జాతీయ స్థాయిలో విశాల దృక్పథం కలిగిన ప్రాంతీయ పార్టీల నాయకులను , సమాజ క్షేమాన్ని కోరుకునే వివిధ రంగాల ప్రముఖులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని కేసీఆర్ ను అంచనా వేయగలిగిన జాతీయ స్థాయి రాజకీయ విశ్లేషకులు నమ్ముతున్నరు .
జాతీయ స్థాయిలో కేసీఆర్ ప్రతిపాదిస్తున్న పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటుకు అవసరమైన సానుకూల వాతావరణం ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తున్నది . ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని , మాజీ ప్రధాని దేవెగౌడ ను కలిసి కాంగ్రెస్ , బీజేపీ యేతర పార్టీలు ఐక్యం కావాల్సిన అవసరాన్ని వివరించి వారిని ఒప్పించడంలో సక్సెస్ అయిన కేసీఆర్ మిగతా ప్రాంతీయ పార్టీల నేతలను కలిసిన తర్వాత ఒక అద్భుతమైన ఎజెండాను రూపొందించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉంది . మరో వైపు వివిధ రంగాల ప్రముఖులతో కూడా కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు . జాతీయ స్థాయి ఎజెండా రూపకల్పన కు అవసరమైన మెటీరియల్ ను సిద్ధం చేస్తున్నారు . ప్రాంతీయ పార్టీల కూటమి నుండి కేసీఆర్ లాంటి దమ్మున్న లీడర్లు కొందరు కలిసి పూర్తి స్థాయి కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలుస్తున్నది . మున్ముందు పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటుకు కావాల్సిన కార్యాచరణ ను ఇంకా వేగవంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి .