ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అదినేత నారా చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాల మరోమారు చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని నాలుగేళ్ల పాటు ఈ మైత్రిని కొనసాగించి ఇటీవలే ఆ బంధానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు బైబై చెప్పేసిన సంగతి తెలిసిందే. తన పార్టీకి చెందిన కేంద్రమంత్రులతో సైతం ఆయన రాజీనామా చేయించారు. పొత్తు వికటించిన అనంతరం బీజేపీపై బాబు భగ్గుమంటున్నప్పటికీ అదంతా నటన మాత్రమేనని 2019లో మళ్లీ బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోనుందని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పొత్తు కుదిర్చేందుకు ఓ సన్నిహితుడిని ఇప్పటికే బాబు లైన్లో పెట్టారని అంటున్నారు. ఆయనే ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష వైసీపీ మొదటి నుంచి గళం వినిపిస్తుండగా చంద్రబాబు మాత్రం కిమ్మనకుండా ఉన్న సంగతి తెలిసిందే. అయితే హఠాత్తుగా నాలుగేళ్ల తర్వాత ఎన్నికల రాజకీయంలో భాగంగా ఆయన బీజేపీకి గుడ్‌బై చెప్పారు. తన పార్టీకి చెందిన మంత్రులతో రాజీనామా చేయించారు. అయితే బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని బాబు ఇంకా ఆరాటపడుతున్నారని ఏపీ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ను ఆ పదవిలో కొనసాగించడం ఇందుకు నిదర్శనం అంటున్నారు. పరకాల సతీమణి నిర్మలా సీతారామన్ కేంద్రంలో కీలకమైన రక్షణ శాఖ మంత్రి హోదాలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ టీంలోని ముఖ్యుల్లో ఆమె ఒకరు. ఈ రకమైన కారణాలతో పరకాలను పదవి నుంచి చంద్రబాబు ఊడబీకవచ్చని అయితే…మళ్లీ పొత్తు ఆలోచనలో భాగంగానే…బాబు ఆ పనిచేయడం లేదంటున్నారు.
2019లో ఎదురయ్యే రాజకీయ అవసరాల కోణంలో…అవసరమైతే బీజేపీతో పొత్తుకు సైతం ఒకే చెప్పేందుకు పరకాలను ఇంకా తన సన్నిహితుల జాబితాలో చంద్రబాబు ఉంచుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీస్తున్న బీజేపీ వ్యతిరేక గాలి వల్ల..ఆ పార్టీకి 2014లో వచ్చినన్ని ఎంపీ సీట్లు తిరిగి రావనే ప్రచారం ఉంది. అలాంటి సమయంలో ప్రాంతీయ రాజకీయ పార్టీల మద్దతు చాలా ముఖ్యం. ఈ విషయాన్ని గమనించే బాబు పరకాల ప్లేస్‌ను ఉంచుతున్నారని దీంతో పాటుగా తన అవినీతిపై కేంద్రం కన్నెర్ర చేస్తే..పరకాల ద్వారా లాబీయింగ్ చేసుకునేందుకు బాబు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.