ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. అధినాయకుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే ఎంతో గౌరవం…అంటూ డబ్బా కొట్టుకునే టీడీపీ నేతలు ఇకా ఆ ప్రచారానికి ఆపివేయాల్సిందే. సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు సాక్షిగా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయకులు చేసిన పనికి జనాలు నవ్వుకోవడమే కాకుండా బాబునే కామెడీగా మార్చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగు తమ్ముళ్ల తీరు ఆ పార్టీ నేతలను తలదించుకునేలా చేసిందని చెప్తున్నారు.
సాక్షాత్తు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు చంద్రబాబును కామెడీ పాలు చేసింది ఎక్కడంటే..నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే. ఇంతకీ ఏం జరిగిందంటే…అంబేద్కర్ జయంతి సందర్భంగా శనివారం రాజధాని పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీ కన్నా తాను సీనియర్‌నని, 1995లోనే తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైతే, 2002లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకొస్తున్నారు. కేంద్రంలో త్వరలోనే టీడీపీ కూడా చక్రం తిప్పే రోజులు రానున్నాయని, మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బాబు తన మార్క్ స్పీచ్ కొనసాగిస్తున్నారు.
అయితే బాబు ఇలా జోరుగా ప్రసంగిస్తుంటే…మరోవైపు తెలుగుతమ్ముళ్లు హ్యాపీగా నిద్రలో జోగడం కనిపించింది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్న వేదిక పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్న ఎంపీ కేశినేని నాని, ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశాంతంగా నిద్రను ఆస్వాదిస్తున్నారు. పార్టీకి చెందిన మరో సీనియర్ నేత గద్దె రామ్మోహన్ సైతం కూల్‌గా కునికిపాట్లతో బాబు ప్రసంగాన్ని గాలికి వదిలేశారు. ఇలా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత సమక్షంలోనే టీడీపీ నేతల కునికిపాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా టీడీపీ నేతల తీరును చాటిచెప్తోంది. రాజ్యాంగ నిర్మాతను నివాళి అర్పించే సమయంలో పార్టీ నేతలు చేసిన పనికి చంద్రబాబు సైతం సిగ్గుపడాల్సిన రీతిలో టీడీపీ నేతల తీరు ఉందని పలువురు పేర్కొంటున్నారు.