ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు మంచినీరు, సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి సాగునీటి రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగర్ రావు పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు.
కొద్ది రోజుల్లోనే విద్యాసాగర్ రావు ప్రథమ వర్థంతి జరుగనున్ననేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఘన నివాళి అర్పించింది. ఇకపై ఈ ప్రాజెక్టును ‘‘ఆర్.విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతల పథకం’’గా పరిగణించాలని నీటి పారుదల శాఖను ప్రభుత్వం ఆదేశించింది.
‘‘సాగునీటి రంగంలో తెలంగాణపై జరిగిన వివక్షను ఆర్. విద్యాసాగర్ రావు ఎలుగెత్తి చాటారు. సంక్షిష్టమైన విషయాలను చాలా సులువుగా అర్థమయ్యే విధంగా విడమరిచి చెప్పి, జరిగిన అన్యాయంపై ప్రజలను చైతన్య పరిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా సాగునీటి అంశాలపై విస్తృత చర్చకు అవకాశం కల్పించారు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాకు తాగునీరు, తెలంగాణలో బీళ్లుగా మారిన భూములకు సాగునీరు అందివ్వాలనేది ఆయన జీవితాశయంగా ఉండేది. ఆయన కల కన్నట్లుగానే సాగునీటి రంగంలో ఎంతో పురోగతి సాధిస్తున్నాం. ఆయన పుట్టిన నల్లగొండ జిల్లాకు నీరందించే డిండి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టుకోవడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ఆర్. విద్యాసాగర్ రావు అనారోగ్యంతో బాధపడుతూ తన చివరి కోరికగా తన సొంతూరు సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి లక్ష్మి నర్సింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి అప్పుడే దేవాలయ పునరుద్ధరణకు కోటి రూపాయలు మంజూరు చేశారు.