ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై నమోదయిన కేసుల్లో ఊరట లభిస్తూనే ఉంది. గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన ఆస్తుల ప్రక్రియపై స్టే విధించిన హైకోర్టు తాజాగా ఇదే కేసులో మరో కంపెనీకి ఊరట కల్గించేలా ఉత్తర్వులు జారీ చేసింది.జగన్ కేసుల్లో ఒకటైన వసంత ప్రాజెక్టు కు చెందిన ఆస్తుల జప్తునకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసింది.
వసంత ప్రాజెక్ట్స్ కు చెందిన 4.5 కోట్ల బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆ ప్రాజెక్టు డైరెక్టర్ వసంత కృష్ణ ప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జప్తు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించడంతో జగన్ కేసుల్లో మరో కంపెనీకి భారీ ఊరట లభించినట్లయింది. మొత్తం మీద జగన్ కేసుల్లో వరుసగా వివిధ కంపెనీల జప్తునకు సంబంధించి ఆటంకాలు తొలిగిపోతున్నాయని చెబుతున్నారు.