వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని పలు రాజకీయ నాయకుల రోమాలు నిక్కపొడుచుకోవడం తధ్యం. ఓ సారి అందుకు గల కారణాలను పరిశీలిస్తే.. నాడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణ వార్తను తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నాలంటూ లేవు.
చివరకు జగన్‌ను నేరుగా అడ్డుకోలేక, దొడ్డిదారిన జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి అక్రమ కేసులు బనాయించారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ విషయం జగమెరిగిన సత్యమే. అయినా, వైఎస్ జగన్ జంకలేదు. నాడు, దేశంలోని రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి భయపడుతున్న సందర్భంలో.. సోనియా గాంధీని ఎదిరించి మరీ కొత్త పార్టీ పెట్టారు వైఎస్ జగన్. అలా, నాడు సోనియా గాంధీని ధిక్కరించి రాజకీయ పార్టీ పెట్టి వైఎస్ జగన్ చరిత్రకెక్కారు.
నేడు, ప్రత్యేక హోదా విషయంలోనూ ప్రధాని మోడీపై ఎదురు దాడి చేసేందుకు వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు. 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, ప్రత్యేక హోదా సాధిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు తిరుపతి వేంకన్న సాక్షిగా మాట ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, అధికారం చేపట్టాక వారు మాట మార్చారని, కానీ, వైఎస్ జగన్ మాత్రం ప్రత్యేక హోదాపై నాటి నుంచి నేటి వరకు ఒకే మాటపై నిలుస్తూ ప్రజలకు అండగా ఉన్నారు.
ఇదిలా ఉండగా. వైఎస్ జగన్‌పై రాజకీయ కక్షలతో అక్రమంగా బనాయించిన కేసులు ఇటీవల కాలంలో ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయి. తాజాగా జగన్‌పై బనాయించిన అక్రమ కేసుల్లో నిందితుడి సీబీఐ పేర్కొన్న ఐఏఎస్ మాజీ అధికారి, అప్పటి ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి మురళిధర్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో హైకోర్టు సీబీఐ అధికారులను చీవాట్లు పెట్టింది. అంతేకాకుండా, జగన్‌పై ఉన్న అక్రమ ఆస్తుల కేసుల అభియోగాల్లో ఇప్పటి వరకు సరైన ఆధారం నిరూపించకుండా ఐఏఎస్ స్థాయి అధికారులను ఇలా కోర్టులో నిలవడేలా చేయడంలో మీ ఆంతర్యం ఏమిటని హైకోర్టు సీబీఐ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది.
అయితే, వైఎస్ జగన్‌పై నమోదైన 11 ఛార్జిషీట్లలో ఇప్పటికే తొమ్మిది వీగిపోగా.. మిగిలిన రెండు ఛార్జిషీట్లలో కూడా జగన్ నిర్దోషిగా, కడిగిన ముత్యంలా బయటకు రావడం ఖాయమని అటు న్యాయవాదులతోపాటు.. ఇటు సీబీఐ అధికారులే బాహాటంగా చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వైసీపీ శ్రేణులు.. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడన్నది ఎంత సత్యమో.. 2019లో జగన్ సీఎంగా బాధ్యతలు చేపడుతారన్నది కూడా అంతే సత్యమంటూ సంబురాల్లో మునిగి తేలుతున్నారు.