ఇసుక మాఫియా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని.. ఇసుకను అక్రమంగా రవాణా చేయాలంటేనే భయపడేవిధంగా మైనింగ్ పాలసీ ఉన్నదని పంజాబ్ గనులశాఖ మంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధు ప్రశంసించారు.బుధవారం తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న ఇసుక మైనింగ్ విధానం, ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయం తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి పంజాబ్ గనుల మంత్రిగా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ సిద్ధ్దు.. తమ రాష్ట్ర అధికారుల బృందంతో హైదరాబాద్ వచ్చారు.ఈ సందర్భంగా టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒక్క ఏప్రిల్ నెలలో కేవలం 11 రోజుల్లోనే ఇసుక విక్రయాల ద్వారా రూ. 40 కోట్లు రావడంపై సిద్ధు ఆశ్చర్యపోయారు. పంజాబ్ రాష్ట్రంలో సంవత్సరం మొత్తం కలిపినా ఇంత ఆదాయం రావడంలేదని అన్నారు . ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన నూతన ఇసుక మైనింగ్ విధానంలోని ప్రధాన అంశాలను.. సుభాష్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎండీసీ ఎండీ మల్సూర్,పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు.