ఈటీవిలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో ‘పటాస్’ ద్వారా వెలుగులోకి వచ్చిన ఓ ఆర్టిస్ట్ విలాసవంతమైన జీవితం కోసం అతను దొంగగా మారినట్టు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. బరి నాగరాజు అలియాస్ నరేందర్ ఇందిరానగర్‌లో నివసిస్తూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుండేవాడు. ఇటీవలే ఇతను పటాస్ కామెడీ షోలో అవకాశం దక్కించుకుని పాపులర్ అయ్యాడు. అప్పటినుంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇదే క్రమంలో డబ్బు కోసం అతను అడ్డదారులు తొక్కాడు. ఇళ్లల్లో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. బైక్‌పై తిరుగుతూ మొదట రెక్కీలు నిర్వహించేవాడు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని, రాత్రికే రాత్రే దొంగతనం చేసేవాడు. గతంలో ఓ సెల్‌ఫోన్ చోరీ కేసులోనూ ఇతను నిందితుడిగా ఉన్నాడు. వరుస చోరీలపై ఫిర్యాదులు రావడంతో.. సీరియస్‌గా దృష్టి సారించిన పోలీసులు.. ఎట్టకేలకు అతన్ని ఆధారాలతో పట్టుకున్నారు. శుక్రవారం నాడు చైతన్యపురి పోలీసులు అతన్ని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.22 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
