కామంతో కళ్లు మూసుకుపోవడం అంటే ఏమిటో నిరూపించాడో ఓ వ్యక్తి. అత్యంత దారుణంగా యాచకురాలిపై కర్కశంగా వ్యవహరించాడు. అత్యాచారం చేయడంతోపాటు..హత్య చేసి పారిపోయాడు. హైదరాబాద్ బాలానగర్‌లో సోమవారం రాత్రి ఘటన జరిగింది. సీఐ బి.కిషన్‌కుమార్ చెప్పిన వివారాలు ప్రకారం..సంగారెడ్డి జిల్లా ఆంథోల్‌కు చెందిన దుర్గమ్మ ముగ్గురు కుమార్తెలు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ పొట్టుపోసుకుంటున్నారు. సూరారం ప్రాంతంలో యాచించే మూడో కుమార్తె (40) సోమవారం రాత్రి కల్లుతాగి గుడెన్మెట్ బస్టాపు వెనుక భాగంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన ఖాళీ ప్రదేశంలో ఉంటున్న తల్లివద్దకు వచ్చింది. అక్కడే ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో నిద్రపోయారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఆమె నోరు, చేతులకు టేపు చుట్టిన గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. ఉదయం ఆమె మృతదేహాన్ని గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. ‘అత్యాచారం చేసిన వ్యక్తే ఆమెను హత్యచేశాడా? లేదా టేపు చుట్టడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయి ఉంటుందా?’ అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందని సీఐ తెలిపారు.
