తెలంగాణ రాష్ట్ర రాజాధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి కాబోయే నూతన వధువరులకు శుభవార్త చెప్పారు.పేదింటి ఆడపిల్లల పాలిట తాను ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటానని అన్నారు. నూతనంగా పెళ్లి చేసుకోబోయే పెళ్ళికూతురికి తులం బంగారంతో పాటు పుస్తెలు మరియు పెళ్ళి కుమారుడికి ఉంగరం అందిస్తానని అన్నారు . అంతేకాకుండా వాటికి తోడు రెండు తులాల బరువైన వెండి మెట్టెలు, నూతన వస్త్రాలతో కూడిన కిట్‌ను ఇస్తామని తెలిపారు.పుట్టింటి సారెలా ఈ పథకం రూపొందించినట్టు తెలిపారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు.
పెళ్లి సమయంకన్నా ముందే ఈ కిట్‌ను అందిస్తామని, లబ్దిదారుల ఎంపిక డివిజన్ బీజేపీ అధ్యక్షులు, బూత్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో మహిళా మోర్చా కార్యకర్తలు మేళతాళాలతో వచ్చి, అందరి సమక్షంలో ఈ కానుకను ఇస్తారని చెప్పారు. ఇందుకోసం తమ వివాహ పత్రికను, ఆధార్ కార్డుతో జతచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.