తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం ఎంఎంటీఎస్ రెండవ దశ పనులపై మంత్రికేటీఆర్ బేగంపేటలోని మెట్రోరైలు భవన్ లో సమీక్ష జరిపారు. నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జీహెచ్ఎంసీకి, రైల్వే శాఖతో ఉన్న పెండింగ్ అంశాలపైన చర్చించారు. ఎంఎంటీఎస్ రెండవ దశ పనులతోపాటు రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలపై ప్రధానంగా చర్చ జరిగింది. దీంతోపాటు చర్లపల్లి రైల్వే టర్మినల్, నాగులపల్లిలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ హబ్ పైన కూడా ఈ సమావేశంలో చర్చించారు.
రైల్వే, జీహెచ్ఎంసీ ఉమ్మడిగా నిరంతరం సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు. ఆనంద్ బాగ్, హైటెక్ సిటీ-కూకట్ పల్లి, తుకారం గేట్, బొల్లారం, ఖైతలాపూర్, చర్లపల్లి, శాస్ర్తీపూర్, ఫలక్ నుమా, ఉప్పుగూడ వంటి 10కి పైగా ఆర్.యు.బి.లు, ఆర్వోబీల పనుల పురోగతిపైన మంత్రి కేటీఆర్ రైల్వే అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల భూసేకరణ, వరద కాల్వల నిర్మాణం, అప్రోచ్ రోడ్డు గుర్తింపు వంటి పనుల్లో జీహెచ్ఎంసీ అధికారులు, రైల్వే అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని కోరారు.
ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న బ్రిడ్జిల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి విజ్ఞప్తికి రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారు. సాధ్యమైనంత త్వరగా వీటిని పూర్తి చేస్తామన్నారు. నగరంలో ప్రభుత్వం చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్సార్డీపీ, రోడ్డు విస్తరణ కార్యకలాపాలకు అవసరం అయిన భూములను ఇవ్వాలని మంత్రి రైల్వే జీఎం వినోద్ ను కోరారు. గతంలో ఇదే విషయంలో రైల్వే శాఖ మంత్రిని కలిసినప్పుడు ఆయన నుంచి సానుకూల హామీ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
రైల్వే, జీహెచ్ఎంసీ అధికారులతో మరో 15 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశం నాటికి నాగులపల్లిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న మల్టీమోడల్ లాజిస్టిక్స్ పైన పూర్తి వివరాలతో రావాలని హెచ్ఎండీఏ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు.
మెట్రో రైల్ పనులపైన మంత్రి కేటీఆర్ సమీక్షించారు. మెట్రోరైల్ అధికారులతోపాటు, ఎల్ అండ్ టి సంస్ధ ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో మెట్రోరైల్ రెండవ దశ పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి మియాపూర్, హైటెక్ సిటీ, జేబీఎస్ కారిడార్లలో జరుగుతున్న పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. రైళ్ల ఫ్రీక్వెన్సీ, వేగం పెంచడంపైన కూడా మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్, ఇతర రైల్వే ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Along with South Central Railways GM Vinod Yadav Ji, reviewed the progress of ongoing MMTS phase-2 works & all the RoB/RuB issues
Also planned a follow up meeting in two weeks to review the proposed new rail terminals in Charlapalli & Nagulapalli to plan for multimodal logistics pic.twitter.com/eluWh62fg0
— KTR (@KTRTRS) April 10, 2018