తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించనున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఈ వారం విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకోనున్నాడు. సోమవారం కామన్వెల్త్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీం విభాగంలో మలేషియాను 3-1తేడాతో భారత బ్యాడ్మింటన్ జట్టు చిత్తు చేసి స్వర్ణం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు సార్లు ఒలింపిక్ రజత పతక విజేత లీ చాంగ్ వీకి షాకిచ్చిన కిదాంబి శ్రీకాంత్ ఈ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజా విజయంతో శ్రీకాంత్ దాదాపు నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నట్లే. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనుంది. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 76,895 పాయింట్లతో ముందంజలో ఉన్నాడు. పురుషుల విభాగంలో తొలిసారిగా నంబర్‌వన్ ర్యాంకును కైవసం చేసుకున్న తొలి భారతీయుడిగా శ్రీకాంత్ నిలువనున్నాడు. గతంలో భారత షట్లర్ సైనా నెహ్వాల్ మహిళల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకు కైవసం చేసుకుంది.