ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఉదయలక్ష్మి ఏప్రిల్ 9న ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మరుసటి రోజు.. అంటే ఏప్రిల్ 13న ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను కూడా మంత్రి విశాఖపట్నంలో విడుదలచేయనున్నారు. ఫలితాలను ఏపీ ఇంటర్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 17వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి1 నుంచి మార్చి 19 వరకు జరిగిన సంగతి తెలిసిందే. పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లోపే ఫలితాలు విడుదల చేయనుండటం విశేషం.
