ఆంధ్రప్రదేశ్ లోని 5కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీ లో వైసీపీ ఎంపీల పోరాటం కొనసాగుతూనే ఉంది. హోదా కోసం వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా ఆస్పత్రికి తరలించగా.. ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి మొక్కవోని సంకల్పంతో దీక్ష కొనసాగిస్తున్నారు. వారికి సంఘీభావం తెలిపిన పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎంపీలతోపాటు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడారు.
సాక్షాత్తూ పార్లమెంటులో ప్రధానమంత్రి ఇచ్చిన హామీకే విలువలేకుండా పోయిందని, ప్రధాని మోదీగారు ఇప్పటికైనా కళ్లు తెరిచి.. ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లు, ఇప్పుడు నాలుగేళ్లు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి చేసిందేమీ లేదని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు నిజమైన పోరాటాన్ని చేస్తున్నారో గుర్తించాలని ప్రజలను కోరారు. హోదా కోసం ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని, కలిసికట్టుగా పోరాడితే ఫలితం దక్కుతుందన్నారు. ఇదే టీడీపీ ఎంపీలు నాలుగేళ్ల ముందు ఏం మాట్లాడారో గుర్తుతెచ్చుకొని.. ఇప్పుడు మాట్లాడాలని హితవు పలికారు.వైఎస్ విజయమ్మతోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు దీక్షలో కూర్చున్నారు.