ఆడుతూ పాడుతూ సంతోషంగా గడపాల్సిన ఇద్దరు చిన్నారులు నెలల తరబడి చిత్రహింసలకు గురయ్యారు. పసిపిల్లలన్న కనీస కనికరం కూడా లేకుండా వారికి నిత్య నరకం చూపించిన ఓ జంట ఉదంతం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో వెలుగు చూసింది. గౌరారం ఎస్సై ప్రసాద్, గ్రామస్థుల వివరాల మేరకు.. గజ్వేల్ మండలం జాలిగామకి చెందిన సురేందర్ భార్య కొన్నేళ్ల క్రితం అతన్ని వదిలేసింది. వర్గల్ మండలం తున్నిఖల్సాకి చెందిన మాదారం రేణుక ఇద్దరు పిల్లలు(దివ్య(4), డేవిడ్(2)) పుట్టిన తర్వాత భర్తకు దూరంగా ఉంటుంది.
గజ్వేల్‌లో కూలి పనులు చేసుకునే సమయంలో వీరిద్దరికి పరిచయమేర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో.. ప్రతీరోజు చిన్నారులను కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి మరీ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. పొగ గొట్టంతో ఒళ్లంతా వాతలు పెట్టడం, ముఖంపై గోళ్లతో రక్కడం చేస్తున్నారు. ఆఖరికి తిండి కూడా పెట్టకపోవడంతో చిన్నారులు ఇద్దరు బలహీనంగా తయారయ్యారు. ఇటీవల చిన్నారి దివ్య అరుపులతో చుట్టుపక్కలవాళ్లు ఇంట్లోకి రాబట్టి ఈ విషయం వెలుగుచూసింది. చిన్నారుల పరిస్థితిని చూసి వారు చలించిపోయారు. ఆకలితో అలమటిస్తున్న ఇద్దరు చిన్నారులకు ముందు అన్నం పెట్టి ఆపై చికిత్స కోసం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు గజ్వేల్ పోలీసులు సురేష్, రేణుకలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారుల సంరక్షణ కోసం చిల్డ్రన్ హోమ్‌కు తర లించనున్నట్లు తెలిపారు.