కాంగ్రెస్‌ది బస్సు యాత్ర కాదు.. తీర్థయాత్ర అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇవాళ ఖమ్మంజిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీ ఆర్ శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లాలోని మధిరలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో మంత్రి కేటీ ఆర్ మాట్లాడుతూ..67 ఏండ్లలో రైతులకు ఏం చేయని కాంగ్రెస్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్‌ది మోసాల చరిత్ర అని… స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ వేరు.. ఇప్పటి కాంగ్రెస్ వేరని మంత్రి తెలియజేశారు. ఇంటింటికీ నల్లాతో నీరందించకపోతే ఓట్లడగనన్న దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని రోడ్లపై నడవొద్దనే మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నామన్నారు. మధిరలో గులాబీ జెండా ఎగురవేయాలని ఆయన స్పష్టం చేశారు.కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఏనాడు కూడా మధిరకు నిధులు కేటాయించలేదన్న మంత్రి.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినంక మధిర అభివృద్ధికి రూ. 15 కోట్లు కేటాయించామన్నారు.కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని ఆంధ్రా ప్రజలు మెచ్చుకుంటున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏపీలో కూడా టీఆర్‌ఎస్ శాఖ పెట్టాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.