ఉద్యమ నేత , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇతర రాష్ర్టాల్లో మద్దతు పెరుగుతున్నది. వివిధ రాష్ర్టాల్లోని తెలుగువారంతా ఆయన వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతుగా ఆదివారం తమిళనాడులో కేసీఆర్ యువసేన ఆవిర్భవించింది. చెన్నైలోని కజిపట్టుర్‌లో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 500 మందితో తమిళనాడు కేసీఆర్ యువసేనను ఏర్పాటుచేశారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని తెలుగువాళ్లంతా కూడా ఈ కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. తమిళనాడు రాష్ట్రంలో నూతనంగా ఆవిర్భవించిన కేసీఆర్ యువసేన పలు కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతుందని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, యువసేన అధ్యక్షుడు చెరుకుపల్లి సతీశ్ తెలిపారు.
తమిళనాడు కేసీఆర్ యువసేన ప్రారంభం అనంతరం వారు మాట్లాడుతూ తమిళనాడులో తెలుగువారు అధికసంఖ్యలో జీవనంసాగిస్తున్నారని, వారంతా తెలంగాణ సీఎం కేసీఆర్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తమిళనాడులో కేసీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తామని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న పలు పథకాలపై ఇక్కడి ప్రజల్లో ఎంతో ఆసక్తి నెలకొన్నదని వారు అన్నారు.