అధికార టీడీపీ పార్టీలోని నేతల నుంచి సామాన్య కార్యకర్తల వరకు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారు. తమకు అడ్డొచ్చిన వారు మహిళలా, సామాన్యులా, చిన్న పిల్లలా, వృద్ధులా అన్నది వారికి అనవసరం, మా దందాలకు అడ్డొచ్చిన వారెవరైనా సరే.. అడ్డు తొలగేదాక దాడులు చేస్తూనే ఉంటామంటూ అనడం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల వంతైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి సంఘటనల గురించి కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. అయితే, నాడు బుజ్జగింపు మాటలతో రైతుల నుంచి రాజధాని నిర్మాణం కోసమంటూ భూములు లాక్కున్న వారే.. నేడు రైతులపట్ల కాలయముడిలా తయారయ్యారు. అందులో భాగంగానే ఈ సారి సామాన్యులపై దాడికి తెగబడటం గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంతైంది. దాడికి పాల్పడటమే కాకుండా, రూములో ఉన్న వారిని కాలర్ పట్టుకుని ఈడ్చి.. ఈడ్చి.. మెట్లమీద పడేశారు. దీంతో భూ నిర్వాసితులు పోరుబాట పట్టారు. సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
గన్నవరం విమానాశ్రయానికి మరిన్ని హంగులు దిద్దేందుకు ఏపీ ప్రభుత్వం భూమిని సేకరించింది. ఇదే నేపథ్యంలో 1974 నుంచి భూమిని సాగుచేసుకుంటున్న షేక్ హైదర్ సాహెబ్, మేడూరి తిరుపతయ్య నుంచి కూడా 10 సెంట్ల స్థలాన్ని సేకరించారు కానీ, పరిహారం మాత్రం చెల్లించలేదు. అంతేకాకుండా, వారి భూముల్లో పనులు చేసుకుంటున్నా అడ్డుకోవడం అధికార పార్టీ నేతలవంతైంది. దీంతో విసుగెత్తన షేక్ హైదర్ సాహెబ్, మేడూరి తిరుపతయ్య మా భూములు తిరిగివ్వండి లేదా భూ పరిహారం అన్నా చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని కాంట్రాక్టర్ ద్వారా తెలుసుకున్న గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భూ నిర్వాసితులిద్దరినీ పిలిపించి తన కార్యాలయంలోని ఒక రూములో బంధించి, తన సిబ్బందితో కొట్టించారు. ఆపై ఇద్దరి షర్టు కాలర్లను పట్టుకుని ఈడ్చుకుంటూ.. మెట్లపైకి తోసేశారు. దాడిని నిరసిస్తూ షేక్ హైదర్ సాహెబ్, మేడూరి తిరుపతయ్య కుటుం బ సభ్యులు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటి ముందు ఉన్న రహదారిపై ధర్నా చేపట్టారు.