ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే సిపిఎం అఖిల భారత మహాసభలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు.సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు.
ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో పార్టీ అఖిల భారత మహాసభలు నిర్వహిస్తున్నామని, కేరళ సిఎంతో పాటు పశ్చిమబెంగాల్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రులు,ఇతర జాతీయ నాయకులు కూడా పాల్గొంటున్నారని వివరించారు.ఈ సభలకు ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు కావాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కి సిపిఎం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగింది. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని ప్రకటించి, జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన నేపథ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి వివరించారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, ఇంకా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని సిఎం చెప్పారు.పరిష్కరించదగిన సమస్యలు కూడా అపరిష్కృతంగానే ఉండడం పాలకుల వైఫల్యమే అని సిఎం అన్నారు.ఇప్పటిదాకా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపిలు సరైన విధానం అవలంభించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సిఎం అన్నారు. కేసీఆర్ అభిప్రాయాలతో సిపిఎం నాయకులు ఏకీభవించారు.దేశ రాజకీయ వ్యవస్థలో మార్పు రావడానికి ముఖ్యమంత్రి ప్రదర్శిస్తున్న చొరవను వారు అభినందించారు. తప్పకుండా మార్పు రావాల్సి ఉందని వారు ఈ సందర్భంగా భిప్రాయపడ్డారు.