తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సూచన చేశారు.మక్కలకు మద్దతు ధర చెల్లించకుండా గ్రామాల్లో దళారులే తక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎండి జగన్ మోహన్ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు తెలిపారు. మక్కల కొనుగోలు కోసం రుణం తీసుకోవడానికి ప్రభుత్వం పూచీకత్తుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మార్క్ ఫెడ్ కు కావాల్సిన గ్యారంటీ ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు తెరిచి, మార్క్ ఫెడ్ ను సమన్వయం చేసుకుని మక్కల కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ హరీష్ రావును కోరారు.
‘‘రైతులెవరూ తక్కువ ధరకు మక్కలను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ప్రతీ గింజనూ మార్క్ ఫెడ్ ద్వారానే కొనుగోలు చేస్తాం. రైతులెవరూ తక్కువ ధరకు మక్కలను అమ్ముకోవద్దు. ప్రతీ క్వింటాళుకు రూ.1425 చెల్లించి ప్రభుత్వం తరుఫునే కొనుగోలు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుంది కాబట్టి రైతులు తొందరపడి మక్కలను తక్కువ ధరకు అమ్ముకోవద్దు. ప్రతీ గింజనూ మేమే కొంటాం. మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా ఆయా మార్కెట్లలో మక్కల కొనుగోలుకు అసవరమైన ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వమే మక్కలు కొనుగోలు చేస్తుందనే విషయాన్ని రైతులకు చెప్పాలి. వారు ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా చూడాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.