ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మందిప్రజల ఆశను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదికగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం రెండో రోజుకు చేరుకుంది. ఏపీ భవన్‌లో ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైయస్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలు శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాగా ఆమరణ నిరహార దీక్షకు దిగిన వైసీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి(75) శనివారం తెల్లవారు జామున అస్వస్థతకు గురయ్యారు.
ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు దీక్షను విరమించాలని సూచించారు. అయితే, దీక్షను విరమించేందుకు మేకపాటి నిరాకరించారు. ప్రత్యేక హోదాపై ఎట్టిపరిస్థితుల్లో వెనకడుగు వేయనని అన్నారు.కాగా, శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో పెనుగాలులకు ఏపీ భవన్‌లోని దీక్ష శిబిరం కకావికలమైంది. అయినా వైసీపీ ఎంపీలు భవన్‌లో దీక్షను కొనసాగిస్తున్నారు.
ఎంపీల దీక్షకు ఢిల్లీలోని పలు తెలుగు సంఘాలు సంఘీభావాన్ని తెలిపాయి. మరోపక్క ఏపీలో ఎంపీల దీక్షకు మద్దతుగా శుక్రవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. వైయస్ జగన్ కూడా గుంటూరు జిల్లాలో క్యాండిల్ ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. హోదా సాధనే లక్ష్యంగా ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆమరణ దీక్షకు దిగిన వైసీపీ ఎంపీలకు ప్రజలు బాసటగా నిలిచారు. పార్లమెంట్ వేదికగా కేంద్రంపై అలుపెరుగని పోరాటం చేసి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పదవులను తృణప్రాయంగా వదిలేసిన ఎంపీలకు మద్దతు వెల్లువెత్తుతోంది.