కరుడుగట్టిన కమ్యూనిస్టు, చింతపల్లి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తెను వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు యత్నిస్తున్నారు. వీలైతే ఆమెను పాడేరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఇటీవల అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ నేపథ్యంలో పాడేరు నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో తిరిగి మహిళా అభ్యర్థినే రంగంలోకి దింపే ఆలోచనతో వున్న వైసీపీ అందుకు అన్ని అర్హతలు కలిగిన వారి కోసం అన్వేషణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో చింతపల్లి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీపీఐ నేత గొడ్డేటి దేముడు కుటుంబంపై దృష్టి సారించింది.
సౌమ్యుడుగా పేరున్న దేముడు రెండుసార్లు చింతపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్వి భజనలో చింతపల్లి పాడేరులో కలవడంతో 2014 ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. 2016లో తీవ్ర అనారోగ్యంతో ఆయన మృతిచెందారు. తర్వాత ఆయన కుటుంబసభ్యులు రాజకీయ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు.