భారత మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ మరో అరుదైన ఘనతను సాదించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్ట్స్ అత్యధికంగా 191 వన్డేలాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు మిథాలీ రాజ్.. ఎడ్వర్ట్స్‌ను దాటి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నాగ్‌పూర్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మహిళల మధ్య తొలి వన్డే జరుగుతోంది. ఈ వన్డే మిథాలీ రాజ్‌కు 192వది. దీంతో అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. 1999 జూన్‌లో మిథాలీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది.
192 వన్డేల్లో మిథాలీ 6,295 పరుగులు చేసింది. అంతేకాదండోయ్ 10 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసి 8 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే క్రికెట్‌లో 6వేల మైలురాయి అందుకున్న తొలి క్రికెటర్‌గా కూడా మిథాలీ రాజ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. రెండుసార్లు భారత జట్టును ప్రపంచకప్ ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ మిథాలీ రాజ్ కావడం విశేషం.