తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరో సారి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి కి బహిరంగ సభ వేదికగా సవాల్ విసిరారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న ( గురువారం )మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అక్కడ ఏర్పాటు చేసిన జనహిత ప్రగతి సభలో మాట్లాడారు. ” రానున్న 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారం లోకి రాకపోతే..నేను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధం… ఉత్తమ్‌కుమార్‌రెడ్డీ.. నీకు దమ్ముందా..? ముందుకురా. నా సవాలును స్వీకరించేందుకు నువ్వు సిద్ధమా..? కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? ఉత్తమ్, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చెందిన జిల్లాలోనే సవాలుచేస్తున్నా” అని బహిరంగ సభా వేదికగా సవాలు విసిరారు.ఈ సవాలుకు సిద్ధపడకపోతే కాంగ్రెస్ ఓడిపోతుందని ఆయన ఒప్పుకున్నట్టు భావించాల్సి వస్తుందని అన్నారు.గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో,పాలేరు ఉపఎన్నికల్లో ,గద్వాల సభలో మంత్రి ఇలాంటి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.