జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్‌కు అనూహ్య షాక్ తగిలింది. ప్రత్యేక హోదా పోరులో్ మొదటి నుంచి ఉద్యమిస్తున్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తనకు మైలేజీ వచ్చేలా పవన్ వేసిన ఎత్తుగడను పలువురు తప్పుపట్టారు. ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి పవన్ తీరును తప్పుపట్టారు. హోదా ఉద్యమాన్ని చీల్చే విధంగా పవన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఢిల్లీలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు ఆమరణ దీక్షలు చేస్తుంటే…రాష్ట్రంలో పాదయాత్రల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు మంచివి కావని చలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని ఇవి నీరుగారుస్తాయని తెలిపారు. వామపక్షాలు, జనసేన చేపట్టే పాదయాత్రకు ప్రత్యేకహోదా సాధన సమితి మద్దతు లేదని తేల్చిచెప్పారు. పాదయాత్రలో పాల్గొనమని ప్రత్యేకహోదా సాదన సమితిని జనసేన ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా సాధనసమితి నేతలు ఢిల్లీకి వెళుతున్నారని, పదవులకు రాజీనామా చేసి, ఆమరణదీక్ష చేసే వైసీపీ ఎంపీలకు సంఘీభావం ప్రకటిస్తామని ప్రకటించారు.
ప్రత్యేకహోదా కోసం వేరు కుంపట్లు సరికాదని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలు కీలక పరిణామమని ఆయన ప్రశంసించారు. తెలుగుదేశం ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీలు ఆమరణ దీక్షలు చేస్తే కేంద్రం దిగివస్తుందని, ఎంపీల రాజీనామా సందర్బంలో జనసేన పాదయాత్ర చేపట్టడం మంచిది కాదని లక్ష్మణరెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చీల్చు ప్రయత్నాలకు పావులు కావద్దని…ఐక్యంగా ఉద్యమించేందుకు అందరూ కలిసి రావాలని ఆయన కోరారు.