గోల్డ్ కోస్ట్ లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో పోటీలు ప్రారంభమైన తొలి రోజే భారత్ తన ఖాతాలో ఒక పతకాన్ని వేసుకుంది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు కచ్చితంగా పతకాలు సాధిస్తుందని ముందుగానే ఊహించారు. అనుకున్నట్లుగానే పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన 25 ఏళ్ల గురురాజా రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు.
ఈ సందర్భంగా గురురాజా మాట్లాడుతూ..‘ఈ పతకం నాకు అంత సలువుగా ఏమీ దక్కలేదు. మొదటి రెండు (క్లీన్ అండ్ జర్క్) ప్రయత్నాల్లో ఫెయిలయ్యాను. చివరిదైన మూడో ప్రయత్నానికి వెళ్లే ముందు నా కోచ్ వచ్చి నాలో ఎంతో స్ఫూర్తి నింపాడు. దీనిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. నీ కుటుంబం, దేశం నువ్వు పతకం తెస్తావని ఆశగా ఎదురుచూస్తున్నారు అని అన్నాడు. ఆ మాటలు నాలో స్ఫూర్తి నింపాయి. ఎలాగైనా పతకం సాధించాలన్న కసిని పెంచాయి. చివరకు విజయం సాధించాను. రజతం సాధించడం ఎంతో ఆనందంగా ఉందది. 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధం అవుతాను. నేషనల్ ఫెడరేషన్ నుంచి నాకు ఎంతో మద్దతు లభించింది. నా కోసం ఎంతో మంది కోచ్‌లు కష్టపడ్డారు. ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని గురురాజా తెలిపాడు.