సీనియర్ నటుడు, డబ్బింగ్ కళాకారుడు చంద్రమౌళి గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారు. చంద్రమౌళిది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తాలుకా మునగలపాలెం. ప్రముఖ నటుడు మోహన్‌బాబు తండ్రి చంద్రమౌళికి గురువు. 1971లో చంద్రమౌళి చిత్ర రంగంలోకి ప్రవేశించారు. సుమారు 45 ఏళ్లకు పైబడిన తన సినీ ప్రస్థానంలో నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా విభిన్న పాత్రలు పోషించారు.చంద్రమౌళి 1971లో ‘అంతా మన మంచికే’ అనే చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, నాగేశ్వరరావు సహా నేటి అగ్ర నటుల అందరి సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలు పోషించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.