అన్ని సర్వేల్లోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే నెంబర్ వన్ సీఎం అని తేలిందని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పినపాన నియోజకవర్గ ప్రగతి సభలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్లుగా శాంతిభద్రతలతో ప్రశాంతంగా ఉందని.. రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లు పెరిగిపోతారని, హిందూ-ముస్లింలు కొట్టుకుంటారని, ఆంధ్రావాళ్లను తరిమికొడతారని ఉద్యమ సమయంలో దుష్ప్రచారం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.అధికారం దక్కదని తేలిపోవడంతో కాంగ్రెస్ నేతలు మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.పీసీసీ చీఫ్ గడ్డం రెడ్డి గాంధీభవన్ లో నిద్రపోతున్నాడని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి నాయిని ఎద్దేవా చేశారు.మరో పదేళ్లు కేసీఆరే తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ దే అధికారం అని..కేసీఆర్ ను ఓడించే దమ్మున్న మొగోడున్నడా అని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి సవాల్ విసిరారు.ఈ సభలో మంత్రులు కేటీఆర్, తుమ్మల, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, మహబూబాబాద్ ఎంపీ సీతారామ్ నాయక్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
