తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరో సారి తన సహృదయతను చాటుకున్నారు.ఏ సమయంలోనైన ఆపదలో ఉన్నవారికి సహాయం అందిస్తానని తాజాగా మరోసారి నిరూపించుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..గత కొన్ని రోజులుగా ప్రాణాంతక కాలేయ సంబంధ వ్యాధితో భాదపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడాలంటూ స్వచ్చంద సంస్థ ప్రతినిధి విజేయ్ అనే వ్యక్తి చేసిన చిన్న ట్వీట్ కి వెంటనే స్పందించి..ఆసుపత్రిలో చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిది నుండి రెండు లక్షల రూపాయలను తక్షణ సాయం అందజేశారు మంత్రి కేటీఆర్ .
రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నందే వాడ గ్రామానికి చెందిన గాదే పాక అశోక్ ,ఛాయా దంపతులకు ఇద్దరు కూతుర్లు. అందులో పెద్దకూతురు అక్షర (7 ) కు నెల రోజుల కిందట జ్వరం వచ్చింది. దవాఖానలో చూపించగా కామెర్లు సోకినట్టు తేలింది. చికిత్స అందించినా తగ్గకపోవడంతో మార్చి 18వ తేదీన హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. పరీక్షలు నిర్వహించగా అక్షరకు కాలేయం పూర్తిగా పాడైందని, వెంటనే కాలేయమార్పిడి శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. ఇందుకు దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న అశోక్‌కు అంతడబ్బు చెల్లించడం భారంగా మారింది.ఆయన హైదరాబాద్‌లోని తమ బంధువుల సహకారంతో బాల రక్షక ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సీ విజయభాస్కర్‌ను సంప్రదించారు.
ఈ మేరకు అక్షర పరిస్థితిని వివరిస్తూ విజయ్ మంత్రి కేటీఆర్‌కు ఈ నెల 21న ట్వీట్ చేశారు. బాలికను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించి.. అక్షర చికిత్స నిమిత్తం అత్యవసరంగా రూ.2 లక్షలు కేటాయిస్తూ ఎల్ఓసీ విడుదల చేశారు. దీంతో అక్షర కుటుంబ సభ్యులు, విజయభాస్కర్ మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని జన్మలెత్తినా మంత్రి కేటీఆర్ సార్ రుణం తీర్చుకోలేమని పేర్కొన్నారు.