కాళేశ్వరం నీళ్లతో శ్రీరామసాగర్ రిజర్వాయర్ ను నింపి ఆయకట్టు రైతులకు వచ్చే వానాకాలంలో నీరందించనున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మంగళవారం ఆయన హెలికాప్టర్ లో జగిత్యాల ప్రాంతాల్లో పర్యటించారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం పనుల పురోగతిని పరిశీలించారు. రాంపూర్ దగ్గర పంపు హౌజ్ పనులను పరిశీలించారు. అతి తక్కువ ముంపు, అతి తక్కువ ఖర్చుతో, అతి ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అద్భుత పథకం శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన పథకమని ఆయన అన్నారు.
జూలై చివరకల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి నీరందించడం తమ లక్ష్యమని అన్నారు.ఒక సంవత్సరంలో ఒక చిన్న ప్రాజెక్టు కూడా పూర్తి కాని పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి సంకల్పించినట్టు ఇరిగేషన్ మంత్రి తెలిపారు.కాకతీయ కాలువ, వరదకాలువ ల మధ్య వివిధ ప్రాజెక్టుల ద్వారా 1 లక్ష ఎకరాలకు నీరందిస్తామని చెప్పారు.మోతే రిజర్వాయర్ కు పునరుజ్జీవన పథకం గ్రావిటీ కెనాల్ ద్వారా నీరిస్తామని తెలిపారు. మోతే గ్రామాం ముంపునకు గురికాకుండానే సాగునీరందించనున్నట్టు చెప్పారు.కొత్తగా 11 ఓ.టి. లు ఇప్పటికే మంజూరు చేశామని, మరో 9 ఓ.టి.లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు.వీటిని 4 మీటర్ల ఎత్తులో పెడుతున్నామని, తద్వారా వరద కాలువ కింద వీలయినంత చెరువులు నింపుతామని మంత్రి వివరించారు.అతి తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాలకు నీరు ఇస్తున్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఉండకపోతే సాగునీటి పథకాలేవీ పూర్తయ్యేవి కావన్నారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు.ఎస్సారెస్పీ పునరుజ్జీవన పధకం అత్యంత కీలకమని మంత్రి వ్యాఖ్యానించారు. ఎగువ భాగాన మహారాష్ట్ర చాలా ప్రాజెక్టులు కడుతోందన్నారు. రైతులు వర్షం కోసం ఎదురు చూడవలసిన పని లేదని ఆయన అన్నారు.శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పధకం ద్వారా 12.45 లక్షల ఎకరాలకు మేలు జరుగుతుందని మంత్రి తెలియజేశారు.జగిత్యాల, నిజామాబాద్,కామారెడ్డి , నిర్మల్ జిల్లాల రైతాంగానికి ప్రయోజనం కలగనుందని చెప్పారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాత్రి పగలు నిర్మిస్తున్నట్టు హరీష్ రావు చెప్పారు. దీనికి అవసరమైన పంపులు, మోటార్లు ఇతర పరికరాలు చైనా నుంచి వస్తున్నాయన్నారు.వచ్చే నాలుగు నెలలలో జూలై నెలాఖరుకు నీరందించే విధంగా ప్రణాళికా బద్దంగా పనులు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. జూలై31 నాటికి అర టీఎంసీ నీటిని తరలించే విధంగా పని చేస్తున్నట్టు చెప్పారు.కాళేశ్వరం మొదటి ఫలితం జగిత్యాల , నిర్మల్ , నిజామాబాద్ , కామారెడ్డి జిల్లా రైతాంగానికి దక్కుతుందన్నారు.24 గంటలు మూడు షిఫ్టుల్లో పనిచేయాలని మంత్రి హరీశ్ రావు సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు.సబ్ స్టేషన్ నిర్మాణాన్ని కూడా జూలై నెలాఖరుకు పూర్తి కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. 119 విద్యుత్ టవర్లను నిర్మించాలని మంత్రి ఆదేశించారు.
ఇకపై ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షించాలని హరీశ్ రావు జిల్లా కలెక్టర్ ను కోరారు. టవర్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా చూడాలని ఆయన కోరారు.మిడ్ మానేరు, మూల వాగుపై 20 చెక్ డ్యాం లను 150 కోట్లతో మంజూరు చేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. కాళేశ్వరం నీటితో ఈ రెండు నదులు పూర్తిగా పునరుజ్జీవనం పొందుతాయన్నారు.పాత కరీంనగర్ జిల్లా ఒక నాడు కల్లోలసీమగా ఉంటే తాము కొన సీమను తలపించే రీతిగా మార్చుతున్నట్టు చెప్పారు.వివిధ జలాశయాల నిర్మాణం వల్ల పూర్వ కరీంనగర్ జిల్లాలో 100 టిఎంసి లు నిల్వ ఉంటాయని ఆయన తెలిపారు. తమకు ప్రజల దీవెన , మద్దతు పుష్కలంగా ఉన్నాయని అన్నారు.ప్రతిపక్షాలు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలెవీ ఫలించవని హరీశ్ రావు స్పష్టం చేశారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవానికి 1,067 కోట్లతో పనులు చేపట్టిన విషయాన్ని మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు. 12 మీటర్ల లిఫ్ట్ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి తీసుకుపోతామన్నారు. దీని ద్వారా ఎస్సారెస్పీ రైతాంగం రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఎస్సారెస్పీ కాల్వలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఎస్సారెస్పీ కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరిస్తామని మంత్రి చెప్పారు.
తెలంగాణ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీరని అన్యాయం జరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇన్నాళ్లూ నిరాదరణకు గురైన శ్రీ రాంసాగర్ ప్రాజెక్టును అద్భుతమైన ప్రాజెక్టుగా మారుస్తామని తెలిపారు. శ్రీరాంసాగర్ పునర్జీవన పథకం ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో తెలంగాణాకు జరిగిన ఆన్యాయాన్ని సరిద్దిద్దడం కోసం కెసిఆర్ ప్రారంభించినట్టు హరీశ్ రావు తెలిపారు.కాళేశ్వరం నుంచి వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ జలాశయానికి గోదావరి జలాలను మళ్ళించి శ్రీరాంసాగర్ కు తిరిగి ఊపిరి పోసి పునర్ వైభవం కల్పించడం ఈ పథకం లక్ష్యమని రావు చెప్పారు. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు అని వ్యాఖ్యానించారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టును 112 టి ఎం సి ల నిల్వ సామర్థ్యంతో, 196 టి ఎం సిల నీటి వినియోగం కోసం నిర్మించారని, మహారాష్ట్ర అనేక బ్యారేజీలని నిర్మించడంతో శ్రీరాం సాగర్ వద్ద నీటి లభ్యత 54 టి ఎం సి లకు పడిపోయిందన్నారు. 25 సంవత్సరాల గోదావరీ ప్రవాహ లెక్కలు కూడా విషయాన్ని దృవీకరించాయని చెప్పారు. పూడిక వల్ల జలాశయం నిల్వ సామర్థ్యం కూడా 80 టి ఎం సి లకు పడిపోయిందన్నారు. దానితో శ్రీరాంసాగర్ పై ఆధారపడిన వివిధ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరందించడం కష్టతరంగా మారిందని హరీశ్ రావు తెలిపారు.చరిత్రలో ఎస్.ఆర్.ఎస్.పి. చివరి ఆయకట్టుకు ఎన్నడూ కూడా నీరు అందలేదన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 85వేల ఎకరాల ఆయకట్టు చూపించీనా ఎన్నడూ ఒక్క ఎకరం కూడా పారలేదని హరీశ్ రావు అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో 58వేల ఎకరాల ఆయకట్టు చూపిస్తే,అక్కడా ఒక్క ఎకరం పారలేదని గుర్తు చేశారు. మొత్తం ఎస్.ఆర్.ఎస్.పి. ఆయకట్టు 14 లక్షల ఎకరాలైతే, కనీసం సగం ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. 8500 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రవహించాల్సిన కాలువల్లో 3500 క్యూసెక్కులకు మించి పారలేదని ఇరిగేషన్ మంత్రి తెలిపారు.
ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని వంటి శ్రీరాంసాగర్ పై ఆధారపడి ఎంతో ఆయకట్టు, ఎన్నో పథకాలున్నాయని చెప్పారు.లోయర్ మానేరు వరకు వరకు ఉన్న కాకతీయ కాలువ ఆయకట్టు , సరస్వతి కాలువ ఆయకట్టు , లక్ష్మి కాలువ , చౌటుపల్లి హనుమంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం ఆయకట్టు , ఆలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నిజామాబాద్ జిల్లా ప్యాకేజీలు 21,22 ల ఆయకట్టు , నిర్మల్ జిల్లా ప్యాకేజీలు 27,28 ల ఆయకట్టు , శ్రీరాంసాగర్ జలాశయం నుండి నిర్మించిన నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆయకట్టుకు నీరందించే చిన్న తరహా లిఫ్ట్ పథకాలు , మిషన్ భగీరధ కోసం నీటి సరఫరా.. ఇవన్ని శ్రీరాంసాగర్ జలాశయం మీద ఆధారపడినవేనాని మంత్రి వివరించారు.వీటికి మొత్తం మీద అవసరమయ్యే నీరు 95 టి ఎం సి లు కాగా , ఆధారపడిన ఆయకట్టు 9.73 లక్షల ఎకరాలని తెలిపారు. ఎస్.ఆర్.ఎస్.పి. శిథిలావస్థకు చేరడం వల్ల ఈ ప్రాజెక్టులపై ప్రభావం పడిందన్నారు. ఎస్.ఆర్.ఎస్.పి. సమృద్ధిగా ఉంటేనే వీటికి ఉపయోగం ఉంటుందన్నారు. కాళేశ్వరం నీళ్ళను వరద కాలువనే జలాశయంగా మార్చి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ జలాశయానికి నీటిని తరలిస్తున్నట్టు హరీశ్ రావు తెలియజేశారు. ఎస్.ఆర్.ఎస్.పి.పునరుజ్జీవన పథకంలో భాగంగా 22వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం కలిగిన వరద కాలువను రిజర్వాయర్ గా మారుస్తున్నట్టు చెప్పారు. ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరు వరకు కాళేశ్వరం నీటిని రోజుకు 2 టి ఎం సి లు తరలించి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తి వద్ద 99 వ కి మీ వద్ద వరద కాలువలో జార విడుస్తామని చెప్పారు.అక్కడి నుండి మూడు దశల్లో 33 మీటర్ల ఎత్తుకు నీటిని పంపు చేసి ఎస్.ఆర్.ఎస్.పి. లోకి పంపిస్తామన్నారు. ఒక్కొక్క పంపు హౌజ్ లో 6.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎనిమిది పంపులు అమర్చుతున్నట్టు తెలిపారు.