తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలీస్ వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండగా..పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే .నిన్నఇద్దరు హోం గార్డులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు.ఒక హోంగార్డ్.. చాలా ఆకలితో అలమటిస్తున్న ఓ వృద్దురాలికి అల్పాహారం తినిపించగా..మరొక హోం గార్డ్ 4 ఏళ్ల బాలికను చేరదీసి తన తండ్రికి అప్పగించారు.
వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా లోని కొల్లాపూర్ కు చెందిన బుచ్చమ్మ(సుమారు 75)కు ఐదుగురు అమ్మాయిలు, నలుగురు కొడుకులు. వారందరికీ వివాహాలు అయ్యాయి. భర్త చనిపోవడంతో ఒంటరిగా మారింది. కొడుకులు, కూతుళ్లు పట్టించుకోకపోవడంతో కేపీహెచ్‌బీ కాలనీ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తుంది. నాలుగు రోజులుగా రోడ్డుపైనే కూర్చుని నడవలేని స్థితిలో ఉన్న బుచ్చమ్మను చూసిన కూకట్ పల్లి ట్రాఫిక్ హోంగార్డ్ బి.గోపాల్ ఆమెకు అల్ఫాహారం తినిపించాడు.
మరో ఘటన హైదరాబాద్లో...
హైదరాబాద్ మహానగరంలోని కూకట్‌పల్లిలో నిన్న ఉదయం 11 గంటల సమయంలో ఓ బాలిక(4) వాహనాల మధ్య నుంచి నడుచుకుంటూ వస్తున్నది. అక్కడే విధులు నిర్వహిస్తున్న హోం గార్డు జహంగీర్ పటేల్ ఆ బాలికను గమనించి ఆమెను చేరదీసి వివరాలు అడుగగా ఆమె ఎటువంటి సమాధానం చెప్పలేదు. పదేపదే బాలికను కుటుంబ వివరాలపై ఆరా తీశాడు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో.. ట్రాఫిక్ బూత్ వద్దకు తీసుకొచ్చాడు. 45 నిమిషాల తర్వాత పాప తండ్రి బూత్ సమీపంలో నుంచి వెళ్తుండగా బాలిక గుర్తించి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, బాలిక తల్లిదండ్రులు హోంగార్డుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విధంగా ఇద్దరు హోంగార్డుల సేవలు ఆదివారం పోలీసు ప్రతిష్టను పెంచడంతో పాటు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షాన్ని కురిపించింది.