హైదరాబాద్-ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించవచ్చని… ప్రతి నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని చెంగిచెర్లలో ఉన్న జాతీయ మాంస పరిశోధన సంస్థను సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు.
ఈ సందర్భంగా పరిశోధన సంస్థలో జరుగుతున్న మీట్ ప్రాసెసింగ్‌తో పాటు మాంసంతో తయారు చేస్తున్న వివిధ రకాల పథార్థాలను పరిశీలించారు. గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలతో పాటు ఖర్చుకు సంబంధించి పలు అంశాలపై పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలతో చర్చించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు 60 లక్షల గొర్రెలు ఉన్న నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో నాణ్యమైన మాంసాన్ని కొనుగోలుదారులకు అందేలా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో కబేళాను పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసేందుకు సెర్ప్ సన్నాహాలు చేస్తోంది. దీనికి పూర్తి సహాయ సహకారాలను అందించేందుకు జాతీయ మాంసం పరిశోధన సంస్థ అంగీకారం తెలిపింది. దేశంలోనే ఏకైక మాంసం పరిశోధన కేంద్రం హైదరాబాద్‌లో ఉందని…దీని సహకారంతో స్థానికంగా మాంసం ప్రాసెసింగ్‌కు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా సెర్ప్ ద్వారా కార్యక్రమాలను రూపొందించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు.