దేశంలో ఎక్కడైన మద్యం బంద్ చేయాలని మొదటగా ముందుకు వచ్చెది మహిళలే ..ఎందుకంటే ఇంట్లో మగవారు తాగి వచ్చి చేసే రచ్చ వారికి తెలుసు. కొంతమంది భరిస్తూనే ఉంటారు..మరి కొంతమందికి అలవాటుగా మార్చుకొంటారు. కాని కొంతమంది మద్యం మత్తులో హత్యలు కూడ చేస్తారు. ఈ క్రమంలో తాజాగా మద్యం మత్తులో తల్లిని, అక్కను అసభ్యంగా బూతులు తిడుతున్నాడని అన్నను తమ్ముడు కత్తిపీటతో నరికి చంపిన ఘటన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామ ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రంపచోటి నరేష్ సెంట్రింగ్ పని చేస్తుంటాడు, ఆదివారం తాగి ఇంటిలో తల్లి అవ్వమ్మ, సోదరి ధనలక్ష్మిని బూతులు తిడుతుండటంతో కోపోద్రిక్తుడైన తమ్ముడు నాగేశ్వరరావు కల్పించుకున్నాడు. మాటా మాట పెరగడంతో అన్నపై కత్తిపీటతో దాడిచేసి గుండె, గొంతుపై బలంగా నరకడంతో ఘటన స్థలంలోనే నరేష్(26) మృతి చెందాడు.
హత్య జరిగిన ప్రాంతాన్ని మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ గోగినేని రామాంజనేయులు, ఎస్‌ఐ రాజశేఖర్‌లు పరిశీలించి, స్థానికులను ఆరా తీశారు. మృతుడు నరేష్‌కు నాలుగు సంవత్సరాల కిందట వివాహమైంది. భార్య రెండు నెలలు కాపురం చేసిన అనంతరం వెళ్లి పోయింది. సోదరుల మధ్యా తరచూ వివాదాలు జరుగుతుంటాయి. ఆదివారం అవి కాస్తా ముదరడంతో హత్యకు దారి తీసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి తల్లి అవమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.