వచ్చే డిసెంబర్ నాటికి కొండపోచమ్మసాగర్ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.సిద్దిపేట జిల్లా ములుగు మండలం లో 15 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మిస్తున్న కొండపోచమ్మ రిజర్వాయర్ పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. గజ్వెల్ మండలం అక్కారం వద్ద కొండపోచమ్మ కు చెందిన పంప్ హౌస్ పనులను మంత్రి ప్రారంభించారు. కొండపోచమ్మ సాగర్ పూర్తయితే రెండు లక్షల 85 వేల ఎకరాలకు డిసెంబర్ నాటికి సాగునీరందుతుందని ఆయన చెప్పారు. దేశంలోనే ఒక సంవత్సరం లో భూసేకరణ తో పాటు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసి రైతులకు నీరందించనున్న చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని హరీష్ రావు అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కొనసాగుతున్న అనేక రకాల కుట్రలను రైతులే భగ్నం చేశారని తెలిపారు. రైతులకు భూములు ఇవ్వొద్దని అటు కాంగ్రెస్ పార్టీ ఇటు కోదండరాం అడ్డుపడినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైఉన్న నమ్మకంతో రైతులే ముందుకొచ్చి స్వచ్చందంగా భూములిచ్చారని మంత్రి పేర్కొన్నారు.అలాగే ఈ ప్రాజెక్టుకు చెందిన అన్ని ప్యాకేజీలలోనూ యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. కొండపోచమ్మ రిజర్వాయర్ వల్ల సిద్దిపేట జిల్లాతో పాటు , మేడ్చల్ , యాదాద్రి జిల్లాల కు సాగు నీరుతో పాటు హైదరాబాద్ నగరానికి త్రాగునీరందుతుందని ఆయన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలోని 19 జిల్లాలలో బీడువారిన పొలాలు గోదావరి జలాల రాకతో పచ్చని పంట పొలాలుగా మారనున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రిజర్వాయర్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని ఆయన గుర్తు చేశారు. రంగనాయకసాగర్ , కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లతో సిద్ధిపేటకు జలకవచం నిర్మిస్తున్నట్టు హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.రంగనాయక సాగర్ పనులు వేగం పెంచాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఇటీవలే ఆదేశించారు. వచ్చే వానాకాలంలో నీరు ఇచ్చే లక్ష్యంగా పని చేయాలని అధికారులను ఆయన కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చిన్నకోడూర్ మండలం చంద్లపూర్ దగ్గర రంగనాయకసాగర్ రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. రంగనాయక సాగర్ రిజర్వాయరులో అప్రోచ్ కెనాల్స్, టన్నెల్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్ ద్వారా లక్షా 10వేల ఎకరాలకు సాగునీరు అందనున్న సంగతి తెలిసిందే. రిజర్వాయర్ నిర్మాణ పనులు 463 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. ఇక కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి పాత నల్గొండ, నిజామాబాద్ జిల్లాలకు కూడా సాగునీరు అందించాలని ప్రభుత్వం ప్రణాళికను అమలు చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్‌మానేరు నుంచి సిద్ధిపేట జిల్లా సరిహద్దులోని అనంతగిరి రిజర్వాయర్‌కు నీళ్లు రానునాయి. అక్కడి నుంచి టన్నెల్, ఓపెన్ కెనాల్ ద్వారా చిన్నకోడూరు మండలంలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను నింపనున్నారు.రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి కొమురవెల్లి మల్లన్నసాగర్, అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్లకు నీళ్లు తరలించనున్నారు.మరో మూడు నెలల్లో రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను పూర్తి చేసి గోదావరి జలాలతో రిజర్వాయర్ నింపాలన్న లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి.మంత్రి హరీష్ రావు వెంట ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి, ఎం.ఎల్.సి. ఫరీదుద్దీన్,రోడ్ డెవలప్మెంటు కార్పోరేషన్ చైర్మన్ టి. నర్సారెడ్డి, ఐ.ఎన్ .సి. మురళీధరరావు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.